bihar: క్షమించండి, నా వల్ల కాదు... తేజస్వీ యాదవ్ కోరికను తీర్చలేనన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్

  • తానున్న భవనాన్ని తనకే కేటాయించాలని కోరిన మాజీ డిప్యూటీ సీఎం
  • ప్రభుత్వ ఆస్తులపై వ్యక్తిగత అనుబంధం వద్దన్న సీఎం నితీశ్
  • తనకు సీఎం పదవీ శాశ్వతం కాదని వ్యాఖ్య
  • కొత్త డిప్యూటీ సుశీల్ కుమార్ మోదీకి భవంతిని ఇవ్వనున్న ప్రభుత్వం

తానెంతో ఇష్టపడి మార్పు చేర్పులు చేయించుకున్న పాట్నా, సర్క్యులర్ రోడ్ లోని 5వ నంబర్ బంగళా, 'పలాటియల్'ను తనవద్దే ఉంచాలని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చేసిన విజ్ఞప్తిని సీఎం నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తేజస్వి ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత, ఈ బంగళాను ఎంచుకుని, దానికి ప్రజాధనంతో మరమ్మతులు, అదనపు హంగులు కల్పించుకున్నారు. మారిన రాజకీయాలు ఆయన్ను పదవికి దూరం చేయగా, ఇప్పుడా ఇంటిపై మక్కువ చంపుకోలేక, ఆ బిల్డింగ్ ను తన వద్దే ఉంచాలని పదే పదే కోరుతున్నారు.

తేజస్వీ విజ్ఞప్తిపై స్పందించిన నితీశ్, ఈ పని చేసి పెట్టడం తన వల్ల కాదని, అందుకు తనను క్షమించాలని చెప్పారు. "ప్రభుత్వ ఆస్తులపై ఎవరూ వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోరాదు. నేనీవేళ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. కానీ నా పదవి కూడా శాశ్వతం కాదు" అని నితీశ్ వ్యాఖ్యానించారు. కీలకమైన ప్రాంతంలో ఉండటం, పక్కనే సీఎం నితీశ్ కుమార్ ఇల్లు, ఎదురుగా తన తండ్రి లాలూ నివాసం ఉండటం తదితరాలు కూడా ఆ భవనంపై తేజస్వీకి మక్కువను పెంచాయని తెలుస్తోంది. కాగా, ఈ భవనాన్ని ఖాళీ చేయించి, కొత్త డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి ఇవ్వాలని బీహార్ సర్కార్ నిర్ణయించుకుంది.

More Telugu News