sunkesula: ఒక్కసారిగా సుంకేసుల, జూరాలకు పెరిగిన వరద... శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు!

  • సుంకేసుల గేట్లన్నీ ఎత్తివేత
  • లక్ష క్యూసెక్కులు దాటిన వరదనీరు
  • జూరాల 9 గేట్లను ఎత్తివేసిన అధికారులు
  • ఈ సీజన్ లో శ్రీశైలానికి భారీ వరద ఇదే
  • నాలుగైదు రోజులు కొనసాగితే రిజర్వాయర్ నిండుకుండే!

ఎగువన కురుస్తున్న వర్షాలకు సుంకేసుల, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయం సుంకేసులకు వస్తున్న వరద లక్ష క్యూసెక్కులను దాటింది. బ్యారేజ్ 15 గేట్లనూ ఎత్తి, వస్తున్న వరద నీటిని వస్తున్నట్టు దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల విషయానికి వస్తే, 84 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో, 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు 1,96,330 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం వర్షాకాల సీజన్ తరువాత శ్రీశైలం జలాశయానికి ఇంత భారీ వరద రావడం ఇదే తొలిసారి. కాగా, ప్రస్తుతం డ్యామ్ లో నీటి నిల్వ 57 టీఎంసీలకు చేరుకుంది. నిన్న 49 టీఎంసీలుగా ఉన్న నీరు, ఒక్క రోజులోనే 8 టీఎంసీలు పెరిగిందని, ఇంత భారీ వరద నాలుగైదు రోజులు సాగితే, డ్యామ్ పూర్తిగా నిండుతుందని అధికారులు అంటున్నారు.

More Telugu News