London: లండన్‌లో రైలు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్

  • ఈ ఏడాదిలో ఇది ఐదో ఉగ్రదాడి
  • భారీ నష్టమే లక్ష్యంగా జరిగిందన్న ప్రధాని థెరెసా మే
  • ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బ్రిటన్

శుక్రవారం లండన్‌లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ మేరకు అమాఖ్ ప్రాపగాండా ఏజెన్సీ పేర్కొంది. పేలుడు పదార్థాలతో ఉన్న ఓ బకెట్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. బ్రిటన్‌లో ఈ ఏడాదిలో ఇది ఐదో ఉగ్రదాడి. తీవ్ర నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే  ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రధాని థెరెసా మే పేర్కొన్నారు.

లండన్‌కు నైరుతి ప్రాంతంలో పార్సన్స్ గ్రీన్ స్టేషన్‌ వద్ద ట్యూబ్ ట్రైన్‌లో జరిగిన ఈ పేలుడుకు బకెట్ బాంబే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బకెట్ మండుతుండగా తాము చూశామని పేర్కొన్నారు. ఈ ఘటనలో చాలామంది ముఖాలు కాలిపోయాయి. పేలుడు జరిగిన వెంటనే తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ సూపర్ మార్కెట్ సంచిలో తెల్లని బకెట్, దాని వైర్లు ట్రైన్ క్యారేజ్ ఫ్లోర్‌కు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More Telugu News