: రైల్వే చరిత్రలో నవశకం ఆరంభం!

శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత రైల్వేల్లో నవశకం ఆరంభమైంది. సుమారు రూ. 1.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య దూరాన్ని కలుపుతూ హైస్పీడ్ బులెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిపోయింది. మొత్తం 508 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మితం కానుండగా, ఇందులో దాదాపు 7 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో ఉంటుంది. కొద్దిసేపటి క్రితం మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతిలో బౌద్ధ సన్యాసుల మంత్రోచ్చారణల మధ్య భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, షింజో అబేలు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

మొత్తం దూరంలో 468 కిలోమీటర్ల మార్గం 20 మీటర్ల ఎత్తులో వంతెనపై సాగుతుంది. 27 కిలోమీటర్ల మేరకు టన్నెల్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 90 శాతాన్ని చౌక వడ్డీపై జపాన్ రుణంగా ఇవ్వనుంది. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది రెండు దేశాల లక్ష్యం. ప్రాజెక్టుకు అవసరమయ్యే సాంకేతికత, రైలు ఇంజన్ లు, బోగీలు తదితరాలన్నింటినీ జపాన్ సమకూర్చనుంది. 2022 ఆగస్టు 15 నాడు తొలి రైలు ప్రయాణించేలా చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రాజెక్టు పూర్తయితే, రెండు నగరాల మధ్య రోజుకు 35 ట్రిప్పులు బులెట్ రైళ్లు తిరుగుతాయని అధికారులు తెలిపారు. అన్ని స్టేషన్లలోనూ ఆగితే 2.58 గంటల్లోను, సూరత్, వడోదరల్లో మాత్రమే ఆగితే, 2.07 గంటల్లోను రైలు గమ్యస్థానం చేరుతుంది. సాధారణ రైళ్లు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 8 గంటల సమయాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గంటకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది. ఒక్కో ట్రిప్ లో 750 మంది ప్రయాణికులు రైలెక్కవచ్చు.

More Telugu News