: నదుల అనుసంధానం తాత్కాలికమే... పెద్దగా ప్రయోజనాలుండవు: చంద్రబాబు

నదులను అనుసంధానించడం ద్వారా తాత్కాలిక ప్రయోజనాలు తీరతాయే తప్ప, దీర్ఘకాలిక లాభాలుండవని, నదులను భావి తరాలకు జాగ్రత్తగా అప్పగించాలంటే వాటి పునరుజ్జీవమే ఏకైక మార్గమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ర్యాలీ ఫర్ రివర్స్' కార్యక్రమం జరుగగా, సీఎం పాల్గొని ప్రసంగించారు. కృష్ణా, గోదావరి, పెన్నా తదితర నదులను అనుసంధానం చేసే బృహత్తర కార్యకమాన్ని చేపడుతున్నామని, అయితే, ఇక్కడ ఒక నదిలో నీరుంటేనే మరో నదికి నీరు చేరుతుందని అన్నారు.

ఆయా నదులు గతంలోలా పుష్కల నీటితో ప్రవహించేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, చెట్ల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, నదులను స్వచ్ఛంగా ఉంచడం వంటి చర్యల ద్వారా నదుల పునరుజ్జీవనానికి మార్గం వేయాల్సి వుందని తెలిపారు. రాయలసీమలో 19 నదులు, కోస్తాలో 20 నదులు ఉన్నాయని, వాటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ఇప్పటికే వేలకొద్దీ చెరువులు తవ్వామని, ఈ దిశగా పంటకుంటలు కూడా తమవంతు పాత్రను పోషిస్తున్నాయని అన్నారు. జగ్గీ వాసుదేవన్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని, ఆయనకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో నదుల పరిరక్షణ కోసం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

More Telugu News