: రేపు ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగం?

ఉత్త‌ర కొరియా వ‌రుస‌గా చేస్తోన్న‌ క్షిపణి, అణ్వాయుధ ప‌రీక్ష‌లు అమెరికా, ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌ల‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే అతి శ‌క్తిమంత‌మైన హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా.. రేపు సుదూర లక్ష్యాన్ని చేరుకునే ఖండాంతర  క్షిపణి ప్రయోగాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తాత, ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్.. సెప్టెంబ‌రు 9, 1948లో డెమొక్రటిక్ రిప‌బ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాను నెల‌కొల్పి ఆ దేశానికి అధ్య‌క్షుడ‌య్యాడు.

డీఆర్ఎన్‌కే నెల‌కొల్పి రేప‌టికి 69 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతోన్న సంద‌ర్భంగా రేపు కిమ్ జాంగ్ ఉన్ మ‌రో క్షిపణి ప‌రీక్ష‌ను నిర్వ‌హించి, ఆ విధంగా త‌న‌దైన శైలిలో సంబ‌రాలు చేసుకుంటాడ‌ని ఆ దేశ స‌రిహ‌ద్దును పంచుకుంటున్న దేశాలు భావిస్తున్నాయి. ఇటీవ‌ల తాము నిర్వ‌హించిన హైడ్రోజ‌న్ బాంబుపై ఉత్త‌ర‌ కొరియా స్పందిస్తూ ఈ వారాంతంలో మ‌రో ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే ద‌క్షిణ కొరియా ప్ర‌ధాని లీ నాక్ యోన్ ఉత్త‌ర కొరియా చ‌ర్య‌ల‌పై మాట్లాడుతూ ఆ దేశం ఈ నెల 9న మ‌రో బాలిస్టిక్ మిస్సైల్ ప్ర‌యోగం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై ద‌క్షిణ కొరియా నేష‌న‌ల్ సెక్యూరిటీ క‌మిటీ స‌మావేశం కూడా ఏర్పాటు చేసుకుని చ‌ర్చలు కూడా జ‌రిపింది. రేపు ఉత్తర కొరియాలో నేషనల్ హాలీడే ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే రేపు తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఉత్తర కొరియా భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News