: ‘అర్జున్ రెడ్డి’ యూనిట్ కి నేనిచ్చే సలహా ఇదే! : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదల కాక ముందు నుంచి మొదలైన వివాదాలు, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఈ సినిమా పోస్టర్ అసభ్యంగా ఉందని, యువత చెడిపోతుందని, ఈ చిత్రాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడటం విదితమే. ఈ వ్యాఖ్యలకు హీరో విజయ్ దేవరకొండ ఘాటు కౌంటర్లు ఇవ్వడం, అందుకు, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

‘‘అర్జున్ రెడ్డి’ చిత్ర యూనిట్ కి నేనిచ్చే సలహా.. మీ సినిమాలో మొదటి నుంచి చివర దాకా ఉన్న ముద్దు సీన్లు అన్నింటినీ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్ లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకుని తప్పకుండా చిల్ అవుతారు’ అంటూ తన దైన శైలిలో వీహెచ్ పై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో పోస్ట్ లో.. ‘‘అర్జున్ రెడ్డి’ మూవీని మరోసారి నేను చూశాను. మన సినీ పరిశ్రమలో లియోనార్డో డికాప్రియో విజయ్ దేవరకొండ అని చెప్పేందుకు నాకు ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న స్టాండర్డ్స్ లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ స్టార్ డమ్ ను అతను ఉపయోగించుకోవాలని  నేను ఆశిస్తున్నాను. ఇతర నటీనటులు చేసిన సంప్రదాయక సినిమాలకు భిన్నంగా డికాప్రియో ఎటువంటి హాలీవుడ్ సినిమాలైతే చేసి మార్పు తీసుకువచ్చాడో ఆ విధంగా చేయాలి. నాన్ కన్వెన్షనల్, నాన్ ఫార్మాలిక్ చిత్రాలు చేయడం వల్లే డికాప్రియో సూపర్ స్టార్ కావడం వెనుక ఉన్న వాస్తవం’ అని వర్మ పేర్కొన్నారు.

More Telugu News