: స్టేట్ బ్యాంకులో 2,780 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ!

తిరుమల శ్రీవెంకటేశ్వరునికి భక్తులు సమర్పించిన బంగారాన్ని దీర్ఘకాల గోల్డ్ డిపాజిట్ స్కీములో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం లభించే హిందూ దేవాలయంగా ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకలుగా వచ్చిన బంగారంలో 2,780 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశామని పేర్కొంది. ఈ మొత్తంలో 2,075 కిలోలను 12 సంవత్సరాల కాలపరిమితికి 2.5 శాతం వార్షిక వడ్డీపై గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద పెట్టుబడిగా పెట్టామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీఐ నుంచి డిపాజిట్ సర్టిఫికెట్లు అందాయని అన్నారు.

కాగా, గత సంవత్సరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్వామివారికి చెందిన 1,311 కిలోల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. మిగతా బంగారాన్ని కరిగించి, స్వామి వారి నాణాలుగా మార్చి భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇదిలా ఉంచితే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,110 కోట్లు భక్తుల నుంచి కానుకల రూపంలో వస్తాయని, వివిధ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లపై రూ. 807 కోట్ల వడ్డీ లభిస్తుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర ఆదాయాల్లో భాగంగా రూ. 300 రూపాయల ప్రత్యేక దర్శనం స్కీమ్ నుంచి, గదుల అద్దెల రూపంలో రూ. 124 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 55 కోట్లు వస్తుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News