: నేను ప్రమాదంలో ఉన్నా.. వారు నన్ను చంపేస్తారు..!: గుర్మీత్‌పై కేసుపెట్టిన సాధ్వి!

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై కోర్టు సంచలన తీర్పు తర్వాత ఆయనపై ఫిర్యాదు చేసిన సాధ్వీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో హింసాత్మక చర్యలకు దిగారు. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 32 మంది మరణించగా వందలాదిమంది గాయపడ్డారు. దీంతో అత్యాచార బాధితురాళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం వారెక్కడున్నారన్న విషయాన్ని వారి న్యాయవాదులు చెప్పేందుకు ఇష్టపడడం లేదు. వారి ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారికి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఈ కేసు నుంచి గుర్మీత్ నిర్దోషిగా బయటపడితే తాము వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని బాధితులు తమతో మొరపెట్టుకున్నట్టు న్యాయవాది తెలిపారు.
 
తీర్పు వెలువడడానికి ముందు బాధితురాలిలో ఒకరు మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను పెద్ద ప్రమాదంలో ఉన్నానని, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గుర్మీత్ అనుచరుల వల్ల తన ప్రాణానికి హాని ఉన్నట్టు ఆమె భయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారి భవిష్యత్తు ఏంటన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.




More Telugu News