: తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. బతుకమ్మ సందర్భంగా 90 లక్షల చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం!

తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చేనేతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.200 కోట్లతో 90 లక్షల చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిరిసిల్ల చేనేత కార్మికులకు 60 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చింది. సూరత్ టెక్స్‌టైల్ మిల్స్‌కు మరో 30 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేనేత అంటే ఒక్క సిరిసిల్లే కాదని, పోచంపల్లి, కొయ్యలగూడెం, గద్వాల, నారాయణపేట, పుట్టపాక కూడా ఉన్నాయన్న సంగతిని విస్మరించడం దారుణమని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. 2019 నాటికి సిరిసిల్లలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకే కేటీఆర్ ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అసలు సిరిసిల్ల కార్మికులు చేనేత కిందకు రారని, వారు పవర్ లూములు ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ వాదిస్తోంది.

అయితే హ్యాండ్యూమ్ డిపార్ట్‌మెంట్ వాదన మరోలా ఉంది. సిరిసిల్ల కార్మికులు పవర్‌లూములు ఉపయోగిస్తున్నారు కాబట్టే వారికి ఆర్డర్ ఇచ్చినట్టు ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. మగ్గంపై ఒక చీర నేయాలంటే ఒక రోజు పడుతుందని, అంతేకాక ధర కూడా రూ.450 వరకు పడుతుందని, అదే పవర్‌లూమ్ అయితే చీర రూ.222కే తయారవుతుందని పేర్కొన్నారు. మొత్తం 90 లక్షల చీరల ఆర్డర్‌ను సిరిసిల్లకే ఇవ్వాలని నిర్ణయించినా అక్కడి కార్మికులు తమ అసక్తతను తెలియజేయడంతోనే సూరత్‌కు అర్డర్ ఇచ్చినట్టు వివరించారు.

More Telugu News