: ఎవరిచ్చారో తెలియని విరాళాలు... బీజేపీకి రూ. 705 కోట్లు, కాంగ్రెస్ కు రూ. 198 కోట్లు!

రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ విరాళాలు ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎలా వస్తున్నాయో తెలియకుండా ఉంటుందన్నదీ విదితమే. ఒక సంవత్సరంలో రూ. 20 వేల కన్నా అధిక డొనేషన్ ను ఓ వ్యక్తి రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తే, సదరు డోనర్ వివరాలను రాజకీయ పార్టీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని ఎన్నికల కమిషన్ గత సంవత్సరం నిబంధనలను సవరించింది. ఇక అంతకుముందు నాలుగేళ్లకు సంబంధించిన విరాళాల లెక్కలు పరిశీలిస్తే, పాన్ కార్డు సంఖ్య లేదా విరాళం ఇస్తున్న వ్యక్తి పేరు, చిరునామా లేకుండా 3 వేలకు పైగా డొనేషన్స్ వివిధ పార్టీలకు వచ్చాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 1,933 మంది తమ పాన్ నంబర్ చెప్పకుండా రూ. 384 కోట్లను విరాళంగా ఇవ్వగా, 1,546 మంది పేరు, చిరునామా చెప్పకుండా రూ. 355 కోట్లు ఇచ్చారు.

ఈ విరాళాల్లో అత్యధికం బీజేపీకి దక్కాయి. ఆసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) బీజేపీ మొత్తం రూ. 705 కోట్లను విరాళంగా పొందింది. ఆ తరువాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఖాతాకు రూ. 198 కోట్లు మాత్రమే లభించాయి. ఈ రెండు పార్టీల తరువాత దేశంలోని టాప్-5 పెద్ద పార్టీల్లో ఉన్న ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు నామమాత్రంగానే విరాళాలు లభించాయి. తమకు రూ. 20 వేలకు మించిన స్వచ్ఛంద విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించడంతో ఆ పార్టీని ఈ గణాంకాల్లో తీసుకోలేదని ఏడీఆర్ పేర్కొంది. ఇక గడచిన దశాబ్ద కాలాన్నీ పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ కు రూ. 3,323 కోట్ల విరాళాలు రాగా, బీజేపీకి రూ. 2,125 కోట్ల విరాళం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిందని ఏడీఆర్ పేర్కొంది.

More Telugu News