: త్రిపుర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు దూరదర్శన్ నిరాకరణ.. ఫైట్ చేస్తామన్న సీపీఎం!

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు దూరదర్శన్, ఆలిండియా రేడియో నిరాకరించడంపై సీపీఎం మండిపడుతోంది. ‘అప్రకటిత ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించింది. సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మాట్లాడుతూ దూరదర్శన్ ప్రైవేటు ఆస్తి కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ-ఆరెస్సెస్, ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, తాజా వివాదంపై ప్రసారభారతి ఇప్పటి వరకు స్పందించలేదు. కార్పొరేట్ ఫెడరలిజం గురించి తరచూ ప్రసంగాలు దంచే ప్రధాని చెప్పేది ఇదేనా? అని సీతారాం ఏచూరి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇది చాలా అవమానకరమన్నారు.

మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో సీఎం మాణిక్ సర్కార్ ఆరు నిమిషాల ప్రసంగాన్ని ప్రసార భారతి ప్రసారం చేయాల్సి ఉంది. అయితే ప్రసంగంలో కొన్ని మార్పులు చేయాలని ప్రసార భారతి సూచించింది. దీనికి మాణిక్ సర్కారు ప్రభుత్వం నిరాకరించడంతో ప్రసారం చేసేందుకు ప్రసారభారతి అనుమతించలేదు. కాగా, సీపీఎం ఆరోపణలపై సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రసంగం ప్రసారం చేయకపోవడంలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

More Telugu News