: 'బ్లూ వేల్ ఛాలెంజ్' గేమ్ ను తొలగించండి... సామాజిక మాధ్యమాలకు కేంద్రం ఆదేశం!

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ, ఫేస్ బుక్, వాట్స్ యాప్, ఇన్ స్టా గ్రామ్ ల నుంచి తక్షణం ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ గేమ్‌ కు సంబంధించిన లింకుల్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అమాయక పిల్లల్ని బలి తీసుకుంటున్న ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ గేమ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దాని వల్ల అపార నష్టం సంభవిస్తోందని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోందని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది.

 ఈ నేపథ్యంలో ఆ గేమ్ కు సంబంధించిన లింకులన్నీ తక్షణం తొలగించాలని ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థలన్నింటిని కోరింది. ఈ గేమ్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తాజాగా భారత్‌ లోని పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒకరిని, ముంబైలో మరొకరిని బలిగొంది. ఒక బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకగా, ఇంకో బాలుడు పాలిథీన్ కవర్ తో ఊపిరాడకుండా చేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

 దీంతో ఈ గేమ్ ను తక్షణం నిషేధించాలని దేశంలో పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ దిగ్గజ సంస్థలకు ఈ గేమ్ ను తొలగించాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నెల 11న లేఖ రాసింది. కాగా, 2013లో రష్యాలో ప్రారంభమైన ఈ బ్లూవేల్‌ ఛాలెంజ్‌ 50 రోజుల పాటు సాగుతుంది. దీనిని నిపుణులు సైకో గేమ్ అని చెబుతుంటారు. 50 రోజులపాటు రోజుకో టాస్క్‌ ఇచ్చి చేయాలని ఆదేశిస్తుంటుంది. మెల్లమెల్లగా చిన్నచిన్న టాస్క్ లతో గెలిచేలా చేస్తూ ఆకట్టుకుంటుంది. పూర్తిగా అందులో లీనమయ్యాక అసలు రంగు విప్పుతుంది. ఈ గేమ్ లో టాస్క్ పూర్తి చేసినట్టు సాక్ష్యం పెట్టాలని కోరుతుంది. దానిని పెట్టిన తరువాత అభినందిస్తుంది. ఆ అభినందనలకు అదెలా చెబితే పిల్లలు అలా చేస్తారు. ఇదే ప్రమాదకరంగా ఉంది. 

More Telugu News