: 'నేను కేటీఆర్ బావమరిదిని..' అంటూ భయపెట్టాడు.. ఏకంగా కంపెనీని తన పేరిట రాయించుకున్నాడు!

తాను తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బావమరిదినని చెప్పి తుపాకీతో బెదిరించి తమ ఐటీ కంపెనీని తనపేరిట రాయించుకున్నాడంటూ సదరు కంపెనీ డైరెక్టర్లు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని మాదాపూర్‌ లో ఇంటర్నల్ క్విస్ట్ ఐటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 2016 మే నెలలో ఒక కంపెనీని అభిషేక్, సాయిచరణ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ కి బావమరిదినని చెప్పుకున్న వంశీధర్ అనే వ్యక్తిని తమ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్ గా అపాయింట్ చేశారు. అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన బకాయిల విషయంలో చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించాలని వంశీధర్ ను ఆ సంస్థ డైరెక్టర్లు అభిషేక్, సాయి చరణ్ లు కోరారు.

 దీనిని అవకాశంగా తీసుకున్న వంశీ సమస్య పరిష్కారానికి పది లక్షల రూపాయలు కోరాడు. అంత డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు పెట్టి లోపలేయిస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన అభిషేక్, సాయి చరణ్ లు ఆ మొత్తాన్ని అతనికి సమర్పించుకున్నారు. ఆ తరువాత మళ్లీ కంపెనీకి వచ్చిన వంశీ ఈ సారి తుపాకీతో వారిపై బెదిరింపులకు దిగాడు. కంపెనీని తన పేరిట బదిలీ చేయించాలని డిమాండ్ చేసి, గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రాణ భయంతో కంపెనీని అతని పేరిట బదిలీ చేశారు. ఇప్పుడు హైదరాబాదు వదిలి వెళ్లకపోతే చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడని వారు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. వంశీపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వారు కమిషన్ ను కోరారు. దీనిపై విచారణకు ఆదేశించిన మానవ హక్కుల కమిషన్ ఏసీపీని అక్టోబర్ 4 లోపు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. 

More Telugu News