: పాకిస్థానా? మేం రాలేం బాబోయ్..!: పీసీబీకి చివర్లో హ్యాండిచ్చిన శ్రీలంక ఆటగాళ్లు

పాకిస్థాన్ లో క్రికెట్ కు జీవం పోయాలని తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడిన అనంతరం ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. కనీసం భారత్ తో తటస్థవేదికలపై మ్యాచ్ లు నిర్వహించి, ఆర్థికంగా పరిపుష్ఠి అవుదామన్న పీసీబీ ఆలోచనకు బీసీసీఐ అంగీకరించడం లేదు. దీంతో ఆసీస్, కివీస్, ప్రోటీస్ ఇలా ఏ జట్టుతోనైనా స్వదేశంలో టోర్నీ నిర్వహించేందుకు షహర్యార్ తీవ్రంగా శ్రమించారు.

ఈ క్రమంలో వివిధ జట్ల బోర్డులతో చర్చలు జరిపారు. అయితే, భద్రతా సమస్యలు చూపి ఏ దేశాలు పాక్ లో ఆడేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో విండీస్ ను సంప్రదించగా, తమ దేశంలో ఆడాలని వారు సూచించారు. నిరాశచెంది, శ్రీలంకను కోరారు. పీసీబీ ఆఫర్ కు తొలుత సరే అని చెప్పిన లంక బోర్డు, ఆటగాళ్లను సంప్రదించగా, వారెవరూ పాక్ లో ఆడేందుకు అంగీకరించలేదు. దీంతో శ్రీలంక బోర్డు పీసీబీకి తాము రావడం లేదని వర్తమానం పంపింది. దీంతో షహర్యార్ ఖాన్ అవాక్కయ్యారు. ఐసీసీ భద్రతాధికారులు కూడా లాహోర్ లో భద్రతపై సంతృప్తి వ్యక్తం చేసినా ఆడేందుకు రాకపోవడం పట్ల షహర్యార్ ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News