: వైయస్ మోసం చేసినప్పుడు ముద్రగడ ఎందుకు మాట్లాడలేదు? ఆయన వెనకున్న అదృశ్య శక్తి ఎవరో మాకు తెలుసు : గంటా

వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను మోసం చేశారని... అప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు మాట్లాడలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని గంటా చెప్పారు. పాదయాత్రల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ముద్రగడ ప్రయత్నిస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కాపులను ఉద్ధరిస్తానని చెప్పుకుంటున్న ముద్రగడ... తన పాదయాత్ర కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ముద్రగడ గత ట్రాక్ రికార్డును పరిశీలించే ఆయన పాదయాత్రకు అనుమతిని నిరాకరించామని గంటా అన్నారు. ముద్రగడను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరో తమకు తెలుసని చెప్పారు. కేవలం రాజకీయ ఉనికిని చాటుకోవడానికే ముద్రగడ పాదయాత్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ముద్రగడ రాజకీయ వ్యూహంలో కాపు యువత పడరాదంటూ సూచించారు. బంగారం లాంటి భవిష్యత్తును పణంగా పెట్టి, కోరి కష్టాలను కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఎన్ని రుణాలిచ్చామన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.

More Telugu News