: వ్యాపార విశ్వాసంపై జీఎస్‌టీ దెబ్బ‌... నివేదిక‌లో వెల్ల‌డి

కొత్త ప‌న్ను విధానాల‌కు అల‌వాటు ప‌డ‌టంలో జాప్యం, మ‌రికొన్ని ప‌న్ను సంబంధిత ఇబ్బందుల వ‌ల్ల గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వ్యాపార విశ్వాసం దాదాపు 13 శాతం తగ్గింద‌ని డ‌న్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా త‌న నివేదిక‌లో పేర్కొంది. గ‌తేడాది జూలై-సెప్టెంబ‌ర్ మాసాల్లో 85.4 శాతంగా ఉన్న వ్యాపార ఆశావ‌హ సూచీ ఈ ఏడాది 72.1 శాతంగా న‌మోదైంద‌ని నివేదిక వెల్ల‌డించింది. ఇందుకు కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన జీఎస్టీ విధివిధానాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని డ‌న్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌నీశ్ సిన్హా తెలిపారు.

పెద్ద కంపెనీలతో పోల్చిన‌పుడు చిన్న‌-మధ్య త‌ర‌హా కంపెనీలు ఈ కొత్త త‌ర‌హా ప‌న్ను విధానానికి అల‌వాటు ప‌డ‌టంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఈ నివేదిక‌లో విక్ర‌యాలు, నిక‌ర‌లాభాలు, కొత్త ఆర్డ‌ర్లు, విక్ర‌య ధ‌ర‌ల సూచీల్లోనూ త‌గ్గుద‌ల క‌నిపించింది. స‌రుకు నిల్వ‌లు, ఉద్యోగ స్థాయుల సూచీల‌పై మాత్రం పెద్ద‌గా జీఎస్‌టీ ప్ర‌భావం ప‌డ‌లేద‌ని నివేదిక తేల్చి చెప్పింది. అంతేకాకుండా జీఎస్‌టీ వ‌ల్ల స‌మ‌స్య‌లు ఈ ఒక్క ఏడాదిలోనే క‌నిపిస్తాయి, ఒక‌సారి ఈ విధానానికి అల‌వాటైన త‌ర్వాత వ్యాపార విశ్వాసంతో పాటు అన్ని ర‌కాల సూచీలు వేగం పుంజుకుంటాయ‌ని మ‌నీశ్ వివ‌రించారు.

More Telugu News