: పిచ్ పై కష్టపడండి.. ఆపై మీ ఎంజాయ్ మీదే: నా స్టైలే సెపరేటన్న రవిశాస్త్రి

బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రావిడ్ లను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇద్దరు సీనియర్ల సేవలు టీమ్ కు ఎంతగానో ఉపయోగపడతాయని... అయితే, సపోర్టింగ్ స్టాఫ్ ఎవరుండాలో తాను నిర్ణయించాల్సి ఉందని చెప్పాడు. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ లతో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. సపోర్టింగ్ స్టాఫ్ తో కలసి రెండేళ్లు పని చేయాల్సింది తానేనని చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ మేరకు స్పందించాడు.

టీమ్ కు బాస్ ముమ్మాటికీ కెప్టెనే అని శాస్త్రి అన్నాడు. కోచ్ వెనకాల ఉండి మాత్రమే నడిపిస్తాడని చెప్పాడు. గంగూలీతో తనకున్న విభేదాలను ఆయన తేలిగ్గా తీసుకున్నాడు. అనవసర విషయాలను తాను పట్టించుకోనని చెప్పాడు. ఆటగాళ్లపై తాను అధికారం చెలాయించనని... వాళ్లతో కలిసిపోయి పని చేస్తానని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని... వాళ్లకు సరైన మార్గనిర్దేశం చేస్తే చాలని అన్నాడు. 'కష్టపడి పని చేయండి... ఎంజాయ్ చేయండి' అనే తన స్టైల్ ను ఇకపై కూడా కొనసాగిస్తానని చెప్పాడు.

More Telugu News