: ఉద్యోగులకు షాకిచ్చిన టాటా మోటార్స్... 1500 మంది మేనేజర్ల తొలగింపు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఉద్యోగులకు షాకిచ్చింది. తమ సంస్థలో మేనేజర్ స్థాయిలో పని చేస్తున్న వారిలో 12 శాతం మందిని... అంటే సుమారు 1500 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు సంస్థ ఎండీ గుంటెర్ బుచ్చక్ స్వయంగా పేర్కొన్నారు. సంస్థ వార్షిక ఫలితాలను వెల్లడించిన ఆయన, పునర్మిర్మాణంలో భాగంగా ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని, వైట్ కాలర్ స్థాయిలోనే కోతలు ఉంటాయి తప్ప కింది స్థాయి ఉద్యోగులను తీసివేయడం లేదని తెలిపారు. మేనేజర్ స్థాయి ఉద్యోగుల పనితీరు, నాయకత్వ లక్షణాలపై సమీక్షించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కొందరు స్వచ్ఛంద ఉద్యోగ విరమణను కోరుకున్నారని తెలిపారు. కాగా, గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సంస్థ నెట్ ప్రాఫిట్ 17 శాతం తగ్గి (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 4296 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లకు చేరుకుంది. టాటా మోటార్స్ బ్రిటన్ అనుబంధ జేఎల్ ఆర్ మాత్రం ప్రోత్సాహకర లాభాలను గడించింది. జేఎల్ఆర్ నికర లాభం 18 శాతం పెరిగి 55.8 కోట్ల పౌండ్లకు చేరగా, ఆదాయం 10 శాతం వృద్ధితో 726 కోట్ల పౌండ్లుగా నమోదైంది. కాగా, ఈ ఫలితాలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 140 పాయింట్లు పెరిగి 0.46 శాతం లాభంతో కొనసాగుతుండగా, టాటా మోటార్స్ 3.68 శాతం లాభంతో రూ. 466 వద్ద కొనసాగుతూ టాప్ గెయినర్ గా నిలిచింది.

More Telugu News