: జరిగిన అవమానాన్ని మర్చిపోలేక...పీసీబీ ఆఫర్ ను తిరస్కరించిన షాహిద్ అఫ్రిదీ

పాకిస్థాన్ క్రికెట్ లో ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ ప్రస్థానం ప్రత్యేకమైనది. టీమిండియాలో సచిన్ టెండూల్కర్ శకం ఆరంభం కాగానే...సచిన్ ను మించిన తురుపుముక్క తమ వద్ద ఉందని ఘనంగా ప్రకటించిన పాకిస్థాన్ షాహిద్ అఫ్రిదీని 1996లో కెన్యాతో జరిగిన టోర్నీతో ప్రపంచానికి పరిచయం చేసింది. అనంతరం పాకిస్థాన్ క్రికెట్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్ మన్ గా జట్టులోకి అరంగేట్రం చేసిన అఫ్రిదీ ఆల్ రౌండర్ గా రూపాంతరం చెందాడు. తరువాత కేవలం స్పిన్ బౌలింగ్ తోనే చాలా కాలం జట్టులో రాణించాడు. తొలి ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ తరపున కూడా అఫ్రిదీ ఆడడం విశేషం. కెరీర్ చివర్లో కెప్టెన్ గా వైఫల్యం చెందడంతో అవమానకర రీతిలో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

క్రికెట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకోవడానికి 'ఫేర్ వెల్ మ్యాచ్' ఆడే అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరాడు. అయితే బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ అతని కోరికను నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ క్రమంలో గత వారం పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నజీమ్ సేథీ ఆయనను కలిసి, ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలనుకుంటున్నామని చెప్పినట్టు తెలిపాడు. అయితే వివిధ కారణాలవల్ల దానిని తాను తిరస్కరించినట్టు వెల్లడించాడు. ఈ సమయంలో మిస్బా ఉల్‌ హక్‌, యూనిస్‌ ఖాన్‌ లు తమ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పేందుకు వారికి సముచిత అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేసినట్టు తెలిపాడు. దీంతో గతంలో పీసీబీ చేసిన అవమానాన్ని అఫ్రిదీ మర్చిపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More Telugu News