: అమల్లోకి వచ్చిన 'హైవే లిక్కర్ బ్యాన్'... మద్యం కంపెనీలు బేర్!

జాతీయ రహదారులపై మద్యం అమ్మకాల నిషేధం, అమల్లోకి రాగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభమైన తరువాత లిక్కర్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి దేశవాళీ ఫండ్ సంస్థల వరకూ లిక్కర్ కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకే మొగ్గు చూపడంతో, యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రీవరీస్, గ్లోబల్ స్పిరిట్స్ తదితర సంస్థలు 8 శాతం వరకూ నష్టపోయాయి.

ఇదే సమయంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు అర శాతానికి పైగా లాభంలో సాగుతున్నప్పటికీ, లిక్కర్ కంపెనీలపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరం వరకూ మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పర్వత ప్రాంతాలైన సిక్కిం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ లకు మినహాయింపు లభించింది. కాగా, హైవేలపై మద్య నిషేధ నిర్ణయం ఈ త్రైమాసికంలో అమ్మకాలపై ప్రభావం చూపవచ్చని ట్రేడ్ పండితులు వేసిన అంచనాలు సైతం కంపెనీ ఈక్విటీలు పడిపోవడానికి కారణమయ్యాయి.

More Telugu News