demonitisation: పరిమితికి మించి క్యాష్ విత్‌డ్రా చేస్తే ఇకపై ట్యాక్స్‌?

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన ప‌రుస్తోన్న‌ నల్లధనాన్ని స‌మూలంగా నాశ‌నం చేస్తామ‌ని చెబుతున్న కేంద్ర ప్ర‌భుత్వం.. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా తీసుకోనున్న నిర్ణ‌యాల్లో భాగంగా నగదు చెల్లింపులపై నిబంధ‌న‌లు, పన్నులు విధించాలని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌దు ‌ర‌హిత‌ లావాదేవీలను మరింత పెంచేందుకు క్యాష్‌ ట్యాక్స్‌ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ప్ప‌టికీ వ‌చ్చేనెల 1వ తేదీనే కేంద్ర ప్ర‌భుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ బ‌డ్జెట్ సంద‌ర్భంగానే క్యాష్‌ ట్యాక్స్ గురించి వివ‌రించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించనున్న ఈ నిర్ణ‌యం ప్రకారం ప్ర‌జ‌లు త‌మ‌ బ్యాంకు అకౌంట్ల నుంచి నిర్దేశించిన పరిమితిని మించి డ‌బ్బును విత్‌ డ్రా చేసుకుంటే వారిపై కొంతమేర పన్ను పడే అవకాశం ఉందని స‌మాచారం. బ్లాక్‌మ‌నీపై కేంద్ర వేసిన ప్ర‌త్యేక దర్యాప్తు బృందం (సిట్) ప‌లు సూచ‌న‌లు చేస్తూ.. 3 లక్షల రూపాయ‌ల‌కు మించిన నగదు లావాదేవీలను, వ్యక్తిగతంగా 15 లక్షల కంటే ఎక్కువగా నగదు కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రానికి సూచ‌న‌లు చేసింది. ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీఫామ్‌ కమిషన్‌(టార్క్‌) కూడా బ్యాంకింగ్‌ క్యాష్‌ ట్రాన్సాక్షన్ ప‌న్నును విధించాలని సూచించింది. బ్యాంకుల్లోని సేవింగ్‌ ఖాతాలు తప్ప మిగిలిన అకౌంట్ల‌ నుంచి ఎంత మేర న‌గ‌దు విత్ డ్రా అవుతుందో స్ప‌ష్ట‌మైన‌ సమాచారం లేదని కేంద్ర ప్ర‌భుత్వానికి చెప్పింది. దీంతో క్యాష్‌ ట్యాక్స్‌ తీసుకొచ్చి నగదు ర‌హిత లావాదేవీల వైపున‌కు ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించాల‌ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

More Telugu News