: రుణగ్రస్తులకు శుభవార్త... నోట్ల రద్దు తరువాత నేడు ఆర్బీఐ కీలక భేటీ... తగ్గనున్న వడ్డీ రేటు!

ఇండియాలో రూ. 1000, రూ. 500 కరెన్సీని రద్దు చేసిన తరువాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తొలిసారి పరపతి సమీక్షను నేడు నిర్వహించనుంది. నోట్ల రద్దు తరువాత వ్యవస్థలోని నల్లధనంలో కొంతమొత్తం ఖజానాకు చేరడం, బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడంతో కీలక వడ్దీ రేట్లను తగ్గించేలా నిర్ణయం వెలువడవచ్చని అత్యధికులు అంచనా వేస్తున్నారు. ఈ సమీక్షలో ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎమ్‌ పీసీ) నేడు సమావేశమై, వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రకటించనుంది. కనీసం పావు శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండో ఎమ్ పీసీ సమావేశమిది. తొలి సమావేశం అక్టోబరులో జరుగగా, రెపో రేటును 0.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక నేడు రెపో రేటు 6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం వెలువడవచ్చని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకుని నెలసరి కిస్తీలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి కలుగుతుంది.

More Telugu News