: ఏటీఎంను పూర్తిగా నింపితే అరగంటలో ఖాళీ... అసలు కారణమిదే!

1000, 500 నోట్లు రద్దయిన వేళ, ఏటీఎం కేంద్రాల్లో ఇలా డబ్బు పెట్టగానే అలా అయిపోతోంది. నిండా క్యాష్ పెట్టామని చెప్పిన తరువాత ఎంతో సేపు డబ్బులు ఉండట్లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇందుకు అసలు కారణాన్ని, దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా ఏటీఎం కేంద్రాలను నిర్వహిస్తున్న ఎస్ఐఎస్ ప్రొసీజర్ సంస్థ ఎండీ రితురాజ్ సిన్హా వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత ఇండియాకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన తన పనిలోకి దిగిన ఆయన, పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడించారు. "పెద్ద నోట్లు రద్దయ్యాయి అని తెలియగానే, అసలు పని మాపైనే ఉందని గుర్తించాం. అదనపు సిబ్బందిని నియమించుకుని, తొలుత ఏటీఎం లలోని నగదును తీసుకు వచ్చాం. బ్యాంకులు మాత్రం కేవలం రూ. 100 నోట్లను మాత్రమే ఏటీఎంలలో నింపేందుకు అనుమతిచ్చింది. వాస్తవానికి ఒక్కో ఏటీఎంలో నగదును అమర్చే అరలు నాలుగు ఉంటాయి. వాటిల్లో ఒకటి రూ. 1000కి, రెండు రూ. 500కు, ఒకటి రూ. 100 నోట్లు పెట్టేందుకు అనువుగా తయారు చేయబడ్డాయి. ఒక్కో అరలో 3 వేల నోట్లు పడతాయి. ఒక డినామినేషన్ కు కేటాయించిన అరలో ఆ నోట్లు మాత్రమే పెట్టాలి. ఇక ఎంతగా పెట్టినా, ఒకసారి ఏటీఎంను నింపితే, రూ. 3 లక్షల వరకూ మాత్రమే రూ. 100 కాగితాలు పెట్టవచ్చు. అంటే రూ. 2 వేల చొప్పున విత్ డ్రా చేసుకుంటుంటే, 150 మందికి మాత్రమే డబ్బు సరిపోతుంది. ఆపై వచ్చే వారు తిరిగి ఏటీఎంను నింపే వరకూ వేచి చూడాల్సిందే" అని సిన్హా వెల్లడించారు.

More Telugu News