: టార్గెట్ రూ. 5 లక్షల కోట్లు, వచ్చింది రూ. 60 వేల కోట్లు... స్పెక్ట్రమ్ వేలానికి పేలవ స్పందన!

దేశంలో వాడకుండా మిగిలివున్న వివిధ బ్యాండ్లలోని రేడియో తరంగాలను విక్రయించడం ద్వారా కనీసం రూ. 5 లక్షల కోట్లను ఖజానాకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరేలా లేదు. స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమై మూడు రోజులు దాటుతున్నా ఇంకా 60 శాతం మేరకు తరంగాలకు ఒక బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇప్పటివరకూ రూ. 60,969 కోట్ల ఆఫర్ లభించింది. టెలికం కంపెనీల్లో రుణ భారం పెరగడం, 700, 900 మెగాహెర్జ్ బ్యాండ్లపై తరంగాలకు ధర అధికంగా నిర్ణయించడంతో 17 రౌండ్ల వేలం ముగిసినా అనుకున్నంత ధర రాలేదు. 2354.44 మెగాహెర్జ్ తరంగాలు మాత్రం 100 శాతం అమ్ముడుపోయాయి. ఇక వేలాన్ని నేడో రేపో ముగిస్తున్నట్టు ప్రకటించాలని టెలికాం డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. రూ. 65 వేల కోట్ల వరకూ అమ్మకపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల కోట్ల వరకూ ఖజానాకు చేరుతుందని ఓ అధికారి తెలిపారు. ఈ మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పిన రూ. 98,995 కోట్లతో పోలిస్తే నాలుగో వంతు మాత్రమే కావడం గమనార్హం. ముంబై సర్కిల్ లో మాత్రమే 1800 మెగాహెర్జ్ తరంగాలకు బిడ్డింగ్ బుధవారం 18వ రౌండ్ లోకి ప్రవేశించింది. ముంబై, మహారాష్ట్ర సర్కిళ్లలో కొంత స్పెక్ట్రమ్ తమకు అవసరమని భావిస్తున్న టాటా టెలీ సర్వీసెస్ పోటీకి దిగింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో తరంగాల ధర 39 శాతం పెరిగింది. యూపీలోనూ స్పెక్ట్రమ్ కోసం టెలికం కంపెనీలు గట్టిగానే పోరాడుతున్నాయి. టెలికం పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం, వోడాఫోన్ రూ. 17 వేల కోట్లు, రిలయన్స్ జియో రూ. 16 వేల కోట్లు, ఐడియా సెల్యులార్ రూ. 15 వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ. 13 వేల కోట్ల విలువైన తరంగాలను దక్కించుకోనున్నాయని సమాచారం.

More Telugu News