: 'మైలాన్ గ్లోబల్' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తెలుగు తేజం బోడేపూడి హరిబాబు

అమెరికా జెనరిక్స్ ఫార్మాస్యూటికల్స్ దిగ్గజం మైలాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బి.హరిబాబు నియమితులయ్యారు. ప్రస్తుతం హరిబాబు మైలాన్ లేబొరేటరీస్ సంస్థ ఓరల్ సాలిడ్డోస్ (ఓఎస్‌డీ), యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) విభాగాలకు అధిపతిగానూ సేవలందిస్తున్నారు. ఈ కొత్త పదవి ద్వారా ఆయన అంతర్జాతీయంగా సంస్థ కార్యకలాపాలకు చెందిన వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ, పర్యవేక్షిస్తారు. దాదాపు 25 ఏళ్ల అనుభవమున్న తెలుగుతేజం హరిబాబు గ్లోబల్ చీఫ్‌గా ఎంపిక కావడంపై ఫార్మారంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామానికి చెందిన హరిబాబు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం వీరా ల్యాబ్స్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో మ్యాట్రిక్స్ లేబొరెటరీస్‌లో చేరారు. మైలాన్ సంస్థ ‘మ్యాట్రిక్స్’ను దక్కించుకున్న తర్వాత 2007 నుంచి మైలాన్‌లో హరిబాబు వివిధ హోదాల్లో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగారు. జనవరి 1, 2009లో మైలాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అలాగే ఏపీఐ టెక్నికల్ ఆపరేషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. అక్టోబరు 2007 నుంచి మైలాన్ లేబొరేటరీస్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇండియా నుంచి మైలాన్ సంస్థలో అత్యున్నత స్థాయి పదవికి పదోన్నతి పొందిన వారిలో హరిబాబు రెండో వ్యక్తి. ఆయనకు ముందు రాజీవ్ మాలిక్ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన మైలాన్ బోర్డు మెంబరుగాను, ఆ తర్వాత గ్లోబల్ సీఈఓ గానూ ఆయన పదోన్నతి పొందారు. భారత ఫార్మా రంగం దూసుకుపోతుండడంతో, అంతర్జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా భారత్ అందిస్తోంది.

More Telugu News