: అక్టోబర్ నుంచి పట్టాలెక్కే 'హమ్ సఫర్' రైళ్లు... ప్రత్యేకతలివి!

2016-17 రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల వేళ, సురేష్ ప్రభు ప్రకటించిన 'హమ్ సఫర్' రైళ్లు వచ్చే నెల నుంచి తమ సేవలను అందించనున్నాయి. పూర్తి థర్డ్ ఏసీ కోచ్ లు మాత్రమే ఉండే ఈ రైళ్లలో సాధారణ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్ ధరలతో పోలిస్తే 20 శాతం వరకూ అధిక ధరను చెల్లించాల్సి వుంటుంది. రెండు ముఖ్య నగరాల మధ్య రాత్రి ఎక్కి, తెల్లారి దిగేలా ప్రయాణించే ఈ రైళ్లను తొలుత న్యూఢిల్లీ - గోరఖ్ పూర్ మార్గంలో ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణ ఏసీ-3 కోచ్ లలో లభించని సౌకర్యాలు ఇందులో కల్పిస్తున్నట్టు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైర్, స్మోక్ డిటెక్షన్ సిస్టమ్, ప్రతి బెర్తుకు మొబైల్, ల్యాప్ టాప్ చార్జింగ్ పాయింట్లు, మహరాజా ఎక్స్ ప్రెస్ రైళ్లలో వాడే వినైల్ షీట్లు, సరికొత్త ఇంటీరియర్, అంధులకు సహాయంగా ఉండేలా బ్రెయిలీ డిస్ ప్లే తదితర సౌకర్యాలుంటాయని వివరించారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తుండటంతో రైల్వేలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకునేందుకే 20 శాతం చార్జీలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. డిమాండ్ అధికంగా ఉండే నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

More Telugu News