: కశ్మీర్‌కు మళ్లీ వేలాది సైనిక బలగాలు.. ఆందోళనలను అణచివేయడమే లక్ష్యం

అల్లర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్‌కు వచ్చే 48 గంటల్లో వేలాదిమంది సైనికులు తరలివెళ్లనున్నారు. దక్షిణ కశ్మీర్‌లో గత రెండేళ్ల నుంచి సైనిక బలగాలను ఉపసంహరిస్తున్న కేంద్రం తాజాగా మరింతమంది సైనికులను కశ్మీర్‌లో మోహరించాలని నిర్ణయించింది. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమై రెండు నెలలు గడిచిన తర్వాత కూడా అక్కడ అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లో తిరిగి శాంతిస్థాపనకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సైనికులను తరలించాలని భావిస్తోంది. కశ్మీర్ యువత ఇప్పటికీ వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలపై రాళ్ల దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వారి వెనుక పాకిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందని భద్రతాధికారులు పేర్కొన్నారు. తిరుగుబాట్లు, పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. సైనిక బలాలను పెద్ద ఎత్తున మోహరించాలనుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఇదేనని వారు స్పష్టం చేశారు. ‘‘చొరబాటుదారులను అడ్డుకునేందుకు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశాం. ఇప్పుడు ఆందోళనకారులపై దృష్టి సారించి ఆయా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం’’ అని మిలటరీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది చొరబాట్లు జరిగాయని, అలాగే ఎక్కువమంది తీవ్రవాదులను మిలటరీ మట్టుబెట్టిందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News