: చంద్రబాబుకు ఊరట!... ‘ఓటుకు నోటు’ పునర్విచారణపై హైకోర్టు స్టే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును పునర్విచారించాలంటూ తెలంగాణ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనని, ఈ కేసుపై పునర్విచారణ చేయాలని ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు పునర్విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓటుకు నోటు కేసుతో రామకృష్ణారెడ్డికి సంబంధమేమీ లేదని, రాజకీయ దురుద్దేశ్యాలతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని, దీంతో సదరు పిటిషన్ ను కొట్టేయాలని చంద్రబాబు నిన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే విధించింది. అంతేకాకుండా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది.

More Telugu News