: 85 ఏళ్ల తల్లి పేరిట కర్ణాటక చీఫ్ సెక్రటరీ అక్రమాలు!

వృద్ధురాలైన తన తల్లి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో కర్ణాటక చీఫ్ సెక్రటరీ అరవింద్ జాదవ్ చిక్కుకున్నారు. 85 సంవత్సరాల తన తల్లి తారాబాయ్ మారుతీరావ్ జాదవ్ ను సర్టిఫైడ్ రియల్టార్ గా సృష్టించి, ప్రభుత్వానికి చెందిన 8.2 ఎకరాల విలువైన భూమిని ఆమె పేరిట రిజిస్టర్ చేయించడంతో పాటు, హెగ్గన హళ్ళి గ్రామ సమీపంలో 16 ఎకరాల్లో లేఔట్లు వేసి వ్యాపారం సాగిస్తున్నట్టు ఈయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన తల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే శక్తి సామర్థ్యాల్లో లేదని, అరవింద్ అక్రమాలకు తెరలేపాడని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అరవింద్ భూ దందాపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, ఆయన లేఔట్లకు సంబంధించిన పత్రాలను తాము సేకరించామని పేర్కొంది. తన తల్లిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నానన్న ఆరోపణలను అరవింద్ ఖండించారు. సొంత ఆస్తులను విక్రయించి, దక్షిణ బెంగళూరు పరిధిలో 8.2 ఎకరాలను కొన్నామని ఆయన స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ అక్రమ దందా ఉదంతం కన్నడనాట రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.

More Telugu News