: సింగపూర్ లో డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చేశాయి

‘గూగుల్’, ‘వోల్వో’ సంస్థలకు చెందిన డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపై ప్రయోగాత్మక దశలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, సింగపూర్ కు చెందిన ‘నుటోనమి’ అనే కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసింది. డ్రైవర్ లెస్ కార్లను రూపొందించిన ఈ సంస్థ, పబ్లిక్ రైడ్ ఆఫర్ చేసింది. ఈ కారును ఫ్రీరైడ్ నిమిత్తం ఎవరైనా స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. నుటొనోమి కంపెనీ నుంచి ఆహ్వానం పొందిన ప్రయాణికులకే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే, సింగపూర్ లో వందలాది మంది ప్రజలు ఫ్రీరైడ్ కోసం అప్లై చేసుకున్నారని ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతానికి సింగపూర్ లో 6.5 చదరపు కిలోమీట్లర ప్రాంతంలో మాత్రమే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తిరుగుతున్నాయని, నిన్నటితో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్ట్ డ్రైవ్ పూర్తయిందని, ఈరోజు నుంచి తమ ఆహ్వానం పొందిన వారిని ఫ్రీ రైడ్ కు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫ్రీరైడ్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్ల ప్రత్యేకత గురించి చెబుతూ, రాడార్ లా పనిచేసే ఆరు సెట్ల లిడార్లను అమర్చామని, ఇవి కారుకు అన్ని వైపులా రోడ్లపై ఉన్న పరిస్థితులను లేజర్ సాయంతో గుర్తిస్తాయన్నారు. ఆరు సెట్ల లిడార్లలో ఒక సెట్ మాత్రమే కారుపై భాగంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందన్నారు. డాష్ బోర్డులో రెండు కెమెరాలు అమర్చామని, దీని ద్వారా వచ్చే అడ్డంకులు, సిగ్నళ్లలో మార్పులను గుర్తించవచ్చని పేర్కొన్నారు.

More Telugu News