: ఏడాది వయసులో తప్పిపోయి పదేళ్లకు దొరికిన కుమారుడు... మూసేసిన కేసును తెరిచిన పోలీసులు

ఏడాది వయసులో తప్పిపోయిన కొడుకు పదేళ్ల వయసులో దొరకడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దేశరాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని భల్వాకు చెందిన ఫరీదా(45) నవంబరు 14, 2007లో తన ఏడాది వయసున్న కుమారుడికి టీకా ఇప్పించేందుకు బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికి మూడు నెలల గర్భిణి అయిన ఫరీదా క్యూ పక్కనే ఉన్న బెంచీలో కూర్చుంది. క్యూ తగ్గిన తర్వాత బాబును అక్కడే కూర్చోబెట్టి అపాయింట్‌మెంట్ స్లిప్ తెచ్చుకునేందుకు వెళ్లి పది సెకన్లలోనే తిరిగి వచ్చింది. ఆలోపే ఎవరో బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు కనిపించకపోవడంతో గుండెలవిసేలా రోదించిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాబు కోసం గాలించిన పోలీసులు ఫలితం కనిపించకపోవడంతో 2009లో కేసును మూసేశారు. అయినా బాబు ఫొటోను పట్టుకుని భార్యభర్తలు ఇద్దరూ రోజూ రెండు మూడు గంటలు ఆశగా గాలించేవారు. మే 15న ఫరీదా ఓల్డ్ సీలంపూర్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ కలిసిన బంధువుతో కిడ్నాపైన కొడుకు గురించి చెబుతూ అతడి ఫొటోను చూపించింది. ఆ ఫొటోను చూసిన ఆమె ఇటువంటి పోలికలతో ఉన్న ఓ బాలుడిని ఇదే ప్రాంతంలో చూశామని చెప్పుకొచ్చింది. దీంతో బాధిత తల్లిదండ్రులు మరోమారు పోలీసులను కలిసి విన్నవించుకున్నారు. స్పందించిన పోలీసులు మూసేసిన కేసును తెరిచి ఆ చుట్టుపక్కల సూళ్లపై నిఘావేశారు. ఎట్టకేలకు బాలుడిని గుర్తించి రెండు రోజులు అనుసరించారు. మూడోరోజు బాబు ఉంటున్న ఇంటిపై దాడిచేశారు. బాబును పెంచుకుంటున్న నర్గీస్, ఆమె భర్త మొహమ్మద్ షమీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట్లో బాబును దత్తత తీసుకున్నామని బుకాయించిన వారు అందుకు సంబంధించిన పత్రాలను చూపించమంటే తెల్లమొహం వేశారు. దీంతో పోలీసు శైలిలో ప్రశ్నించగా నిజం కక్కారు. తమకు పిల్లలు లేరని, దత్తత తీసుకోవాలంటే బోల్డన్ని అడ్డంకులు ఉండడంతో బాబును కిడ్నాప్ చేసి పెంచుకుంటున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాబు తల్లదండ్రులను నిర్ధారించేందుకు బుధవారం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.

More Telugu News