: మాల్యాపై మరో కేసు!... మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ!

అప్పులిచ్చిన బ్యాంకులను నట్టేట ముంచి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై మరో కేసు నమోదైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.6,027 కోట్ల మేర అప్పు తీసుకున్న మాల్యా... సదరు రుణంలో చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. ఈ రుణం వడ్డీతో కలిపి రూ.9 వేల కోట్లకు పైగా చేరుకుంది. అప్పు వసూలు కోసం బ్యాంకులు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా లండన్ చెక్కేసిన మాల్యా... ఇప్పుడప్పుడే తిరిగి రాలేనని బాహాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్బీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే మాల్యాపై కేసు నమోదు చేసింది. తాజాగా కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా నిన్న మాల్యాపై కేసు నమోదు చేసింది. పీఎంఎల్ఏ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ... దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

More Telugu News