: రూ. 3 లక్షలు దాటే నగదు చెల్లింపులపై నిషేధం... నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కీలక నిర్ణయం!

దేశంలో నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. రూ. 3 లక్షలు మించి జరిగే నగదు లావాదేవీలను నిషేధించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం బ్లాక్ మనీపై సమీక్షించి సిఫార్సులు చేయగా, ఇప్పుడు వాటిని కేంద్రం ఆమోదం కోసం పంపారు. ఈ ప్రతిపాదనలపై వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమ రంగాల్లో రూ. 15 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం అమలులో ఉండగా, దీన్ని రూ. 3 లక్షలకు తగ్గిస్తే ఆదాయపు పన్ను అధికారుల నుంచి వేధింపులు పెరుగుతాయని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. నగదు లావాదేవీలన్నీ క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కులు, డీడీల రూపంలోనే జరపాలన్న లక్ష్యంతోనే రూ. 3 లక్షల పరిమితి విధించాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ తరహా చెల్లింపులైతే వెంటనే వాటిని ట్రాక్ చేసే వీలు ఇన్ కం టాక్స్ అధికారులకు సులువవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 3 లక్షలు అతి తక్కువ మొత్తమని వ్యాపారులు వాపోతున్నారు.

More Telugu News