: బలోచిస్థాన్ విషయంలో మోదీ వ్యాఖ్యలు సబబే.. వెనకేసుకొచ్చిన ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు

బలోచిస్థాన్ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఆఫ్గనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సమర్థించారు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి మోదీ మాట్లాడుతూ బలోచిస్థాన్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అక్కడ మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందంటూ మోదీ వ్యాఖ్యనించారు. ఆయన వ్యాఖ్యలతో పాక్‌లో ప్రకంపనలు చెలరేగిన సంగతి విదితమే. హమీద్ కర్జాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు, ఆయనను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు. ఇండియా శాంతిదేశమని, పరోక్షయుద్ధానికి అది ఎప్పుడూ కాలు దువ్వదని పేర్కొన్నారు. ఉగ్రవాదం కోసం పాకిస్థాన్ కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదం కారణంగానే కశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారుతోందన్న కర్జాయ్, అదెక్కడి నుంచి దిగుమతి అవుతుందో తమకు తెలుసని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి అన్నారు. ఆఫ్గనిస్థాన్ భారత్ నుంచి రక్షణ సామగ్రిని కోరుకుంటోందన్నారు. తమ దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే విషయంలో భారత్ సాయం అవసరమని కర్జాయ్ పేర్కొన్నారు.

More Telugu News