: ఇక మదర్సాల్లోనూ ఎగరనున్న త్రివర్ణ పతాకం.. రాష్ట్రీయ ముస్లిం మంచ్ నిర్ణయం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ ముస్లిం మంచ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాన్ని కాదని మదర్సాల్లో జెండా పండుగ జరుపుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు చర్యలు చేపట్టింది. అలహాబాద్‌లో ఇటీవల ఓ స్కూలు జాతీయ గీతాన్ని పాడేందుకు నిరాకరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా గత కొన్నేళ్లుగా ఆరెస్సెస్‌లో కూడా జెండాను ఎగురవేసే సంప్రదాయం లేదు. ఆరెస్సెస్ కోర్ కమిటీ సభ్యుడు, మంచ్ అధ్యక్షుడు అయిన ఇంద్రేష్ కుమార్ నాగ్‌పూర్‌లోని బినాకి మంగల్వారిలోని ఓ మదర్సాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ చరిత్రలో ఓ నాయకుడు మదర్సాను సందర్శించడం బహుశా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్సాల్లో జెండాను ఎగురవేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని మదర్సాల్లో జెండా పండుగ నిర్వహిస్తామని, భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తామని పేర్కొన్నారు. వందేమాతరాన్ని కూడా ఆలపిస్తామన్నారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్రీయ ముస్లిం మంచ్, ఆరెస్సెస్ కలిసి యాంటీ టెర్రర్ సెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇంద్రేష్ వివరించారు.

More Telugu News