: సీన్ రివర్స్... ఢమాలంటూ పడిపోయిన ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు!

ఈ-కామర్స్ వెబ్ సైట్, యాప్స్ ద్వారా జరిగే స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో గణనీయంగా పడిపోయాయి. భారత మార్కెట్ పై కన్నేసిన విదేశీ సంస్థలు, యాప్స్, వెబ్ సైట్స్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టి, భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించగా, వినియోగదారులు సైతం అదే విధంగా స్పందించారు. ఆకాశానికి ఎగసిన ఆన్ లైన్ అమ్మకాలతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మొబైల్స్ విక్రయాలు జరుపుతున్న చిరు వ్యాపారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇక ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లపై కేంద్రం కఠిన నిబంధనలు తీసుకురావడంతో సీన్ రివర్సైంది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఆన్ లైన్ మాధ్యమంగా సాగే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఏకంగా 32 శాతం దిగజారాయి. ఇదే సమయంలో ఆఫ్ లైన్ అమ్మకాలు పెరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకటించింది. దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మాత్రం పెద్దగా నష్టపోలేదని, మిగతా స్మార్ట్ ఫోన్ విక్రయాలు జరుపుతున్న ఈ-కామర్స్ కంపెనీలు భారీగా విక్రయాలు కోల్పోయాయని తెలిపింది. కొత్త నిబంధనలతో భారీ డిస్కౌంట్లకు చెక్ పడగా, ఆ కారణంతోనే అమ్మకాలు తగ్గాయని 'లీఎకో' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ వెల్లడించారు. స్పెషల్ ప్రైస్, డిస్కౌంట్ తదితరాలు మాత్రమే కస్టమర్లను ఆకర్షించి ఆన్ లైన్ వైపు నడిపిస్తున్నాయని, అవే లేకుంటే అమ్మకాలు క్షీణించక తప్పదని అభిప్రాయపడ్డారు.

More Telugu News