: రూ. 4,300 కోట్ల బ్రహ్మోస్ రెజిమెంట్ రెడీ... తొలి అడుగు చైనా సరిహద్దుల్లోనే

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్, ఇక భారత సైన్యానికి సేవలను అందించనుంది. దాదాపు రూ. 4,300 కోట్ల వ్యయంతో తయారు చేసిన బ్రహ్మోస్ రెజిమెంట్ ను చైనా సరిహద్దుల్లో మోహరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. పర్వత ప్రాంతాల్లో దీని అవసరం ఎంతో ఉందని అధికారులు అంటున్నారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థను పొందుపరిచిన బ్రహ్మోస్ క్షిపణులు, పర్వతాలు అడ్డొచ్చిన వేళ, వాటంతట అవే పైకీ, కిందకూ ప్రయాణిస్తూ వెళ్లి లక్ష్యాన్ని ఛేదించగలవు. 75 డిగ్రీల వరకూ వంపు తిరిగి దూసుకు వెళ్లగలవు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బ్రహ్మోస్ రెజిమెంట్ కు ఓకే తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెజిమెంట్ లో 100 బ్రహ్మోస్ క్షిపణులు, హెవీ ట్రక్కులపై నిలిపి ఉంచే ఐదు లాంచర్లు, మొబైల్ కమాండ్ పోస్ట్, ఇతర హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ వ్యవస్థలు ఉంటాయని వివరించారు. నాన్ - న్యూక్లియర్ క్షిపణిగా అభివృద్ధి చెందిన బ్రహ్మోస్ క్షిపణులు 290 కిలోమీటర్ల వరకూ ప్రయాణించి శత్రువుల భరతం పడతాయి. సాధారణ సబ్ - సోనిక్ మిసైళ్లతో పోలిస్తే, 9 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా దూసుకెళతుతుంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో దాదాపు 4,507 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉండగా, దీని వెంట చైనా భారీగా ఆయుధాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో చైనా సైనికులు పలుమార్లు చొరబాట్లకు పాల్పడ్డారు కూడా. దీంతో, ఇక్కడ మరింత నిఘా, అధిక ఆయుధ సంపత్తిని మోహరించాలని భారత సర్కారు కూడా భావించింది. అందువల్లే అరుణాచల్ సరిహద్దులకు బ్రహ్మోస్ రెజిమెంట్ ను పంపనుంది. కాగా, మూడు వేరియంట్లలో బ్రహ్మోస్ క్షిపణులు అందుబాటులో ఉండగా, 10 చిన్న యుద్ధ నౌకలపై వీటిని ఇప్పటికే భారత్ మోహరించిందని బ్రహ్మోస్ ప్రాజెక్టు చీఫ్ సుధీర్ మిశ్రా వెల్లడించారు. సుఖోయ్ - 30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ఈ క్షిపణులను ప్రయోగించి, వాటి పనితీరును పరీక్షించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెలలోనే సుఖోయ్ లకు ల్యాండ్, సీ వేరియంట్ బ్రహ్మోస్ లను అమర్చి ప్రయోగాలు చేయనున్నామని వెల్లడించారు.

More Telugu News