: ‘ఆపిల్’ సహకారం... పోలీసుల వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ‘పైరసీ’ దొంగ వివరాలు

ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ దొంగ ఎవరో తెలిసిపోయింది. 'కికాస్ టోరెంట్స్' అనే పైరసీ వెబ్ సైట్ ని నడుపుతున్న అతని పేరు ఆర్టెమ్ వాలిన్. ఉక్రెయిన్ దేశస్థుడు. వాలిన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దొంగ వివరాలు తెలియజేసిన క్రెడిట్ మాత్రం ప్రముఖ సంస్థ ‘ఆపిల్’ కే దక్కుతుంది. తన ఐక్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న వాలిన్ వివరాలను అమెరికా పోలీసులకు అందించింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అతనిపై కాపీరైట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ తో పాటు పలు కేసులు నమోదు చేశామన్నారు. తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో వాలిన్ తరచుగా మకాం మారుస్తూ పలు దేశాలకు వెళుతుండేవాడు. అతనికి సంబంధించిన ఒక బ్యాంకు అకౌంట్ తో పాటు వెబ్ సైట్ కు అనుబంధంగా ఉన్న ఏడు డొమైన్ నేమ్స్ ను కూడా నిలిపివేశా మన్నారు. కాగా, కికాస్ టోరెంట్స్ వెబ్ సైట్ విలువ రూ.363 కోట్లుగా లెక్కగట్టారు. బ్రిటన్, ఐర్లాండ్, ఇటలీ, డెన్మార్క్, బెల్జియం, మలేషియాల్లో వాలిన్ డొమైన్స్ ను ఇప్పటికే నిలిపివేశారు. ప్రపంచ వ్యాప్తంగా 28 భాషలకు సంబంధించిన సినిమాలను పైరసీ చేసి తన వెబ్ సైట్ ద్వారా వాలిన్ అందిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతనిపై చికాగో కోర్టులో విచారణ జరుగుతోంది.

More Telugu News