: ఒలింపిక్స్ కు రష్యా వద్దే వద్దు... దేశాన్నే నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ డిమాండ్!

రియోలో జరిగే ఒలింపిక్స్ నుంచి రష్యా దేశాన్ని నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (వాడా) డిమాండ్ చేసింది. 2014 సోచి వింటర్ గేమ్స్ తదితర పోటీల్లో రష్యా ఆటగాళ్లు ఉత్ప్రేరకాలను వాడి విజయం సాధించారని, దీనికి ప్రభుత్వాధికారులు సైతం సహకరించారని కెనడా న్యాయ నిపుణుడు రిచర్డ్ మెక్ లారెన్ విచారణ జరిపి, నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాడా ఈ మేరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని కోరింది. ఎఫ్ఎస్బీ సీక్రెట్ సర్వీస్ సహకారంతో విచారణ జరిపిన మెక్ లారెన్, ప్రభుత్వ పాత్రపైనా సాక్ష్యాలను సేకరించారు. రష్యా క్రీడా మంత్రిత్వ శాఖ స్వయంగా 30 ఆటల విభాగాల్లో ఆటగాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు. వాడా సూచనలపై ఐఓసీ రేపు అత్యవసర సమావేశం జరిపి చర్చించనుంది. ఈ నివేదిక తమకు దిగ్బ్రాంతిని కలిగించిందని, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసిందని, ఒలింపిక్స్ తదితర ప్రపంచ ఈవెంట్లను ప్రశ్నిస్తోందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యన్ ఒలింపిక్ కమిటీ, రష్యన్ పారిలింపిక్ కమిటీ ఇచ్చిన అందరు అథ్లెట్లనూ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించాలని వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐఓసీ, ఐపీసీలకు సూచించింది.

More Telugu News