: బంగ్లాదేశ్‌లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో అధికారపార్టీ నేత కొడుకు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ అరిస్టాన్ బేకరీలో రెండు రోజుల క్రితం మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఒకరు అధికార అవామీలీగ్ పార్టీ నేత కొడుకు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. భద్రతా దళాల ఆపరేషన్‌లో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను విడుదల చేసిన అనంతరం వారిని రోషన్ ఇబ్నే ఇంతియాజ్, షమీమ్ ముబాషిర్, నిబ్రాస్ ఇస్లాంలుగా గుర్తించారు. వీరిలో రోషన్ అధికార అవామీలీగ్ పార్టీ ఢాకా పట్టణ చాప్టర్ నాయకుడు, బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎస్ఎం ఇంతియాజ్ ఖాన్ బాబుల్ కుమారుడు. తన కుమారుడు కనిపించడం లేదని జనవరి 4న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణించిన ఉగ్రవాదులు ముగ్గురూ ఢాకాలోని ప్రముఖ స్కూళ్లలో చదువుకున్నవారు కావడం గమనార్హం. అలాగే ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవారు. షమీమ్ ఢాకాలోని టాప్ స్కూల్ అయిన స్కూలస్టికాలో చదువుకున్నాడు. రోషన్ కూడా ఇదే స్కూల్‌లో చదువుకున్నాడు. మరో ఉగ్రవాది నిబ్రాస్ మరో ప్రముఖ స్కూలైన టర్కిష్ హోప్స్‌, మలాయ్‌సియాస్ లోని మోనాష్ యూనివర్శిటీలో చదువుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆటను తీయించుకున్న ఫొటో ఆయన ఫేస్‌బుక్ పేజీలో ఉంది. ముష్కరులు ముగ్గురు జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన వారని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ హస్తం ఉందని ప్రధాని షేక్ హసీనా రాజకీయ సలహాదారు హొస్సైన్ తౌఫిక్ ఇమామ్ ఆరోపించారు.

More Telugu News