: హైదరాబాద్ లో సాధారణమై పోయిన యువతీ యువకుల సహజీవనం... ఆపై ఆత్మహత్యలు!

21 సంవత్సరాల వైభవి (పేరు మార్చాం). ఐటీ ఉద్యోగిని. తన కొలీగ్ సుశాంత్ ను ప్రేమించి, వివాహం చేసుకోకుండానే సహజీవనం చేసింది. కొద్దిగా సెటిలైన తరువాత పెళ్లి చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. కానీ, సంవత్సరం తరువాత ఆమె పెళ్లి కలలు కల్లలయ్యాయి. సుశాంత్ ఆమెపై ఇష్టాన్ని కోల్పోయాడు. విద్యార్హతలు తక్కువని ఆరోపిస్తూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని వైభవి కోర్టును ఆశ్రయించినా, ఫలితం లేకపోయింది. దీంతో గుండె బద్ధలైన ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రాణత్యాగం చేసింది. ఒక్క వైభవి జీవితమే కాదు. హైదరాబాద్ లో సర్వసాధారణమైపోయిన సహజీవనాలు ఎందరో అమ్మాయిలకు తీరని వ్యధలను మిగులుస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, ఉద్యోగ విధులు తదితరాలు యువతులను సహజీవనం వైపు నడిపిస్తుండగా, అందులో పెళ్లి దాకా సాగుతున్నవి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోర్టుల పరిధిలో, తాము సహజీవనం చేసి అన్యాయమై పోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ 15 మంది యువతులు వేసిన కేసులు విచారణ దశలో ఉన్నాయి. సహజీవనానికి చట్ట బద్ధత లేకపోవడం, ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే జీవనం గడిపినందుకు, అబ్బాయి చేసే మోసమేమీ లేదని కోర్టులు తీర్పిస్తుండటం యువతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని కేసులను వాదిస్తున్న న్యాయవాదులు వెల్లడించారు. "ఫ్యామిలీ కోర్టుల్లోని చాలా కేసుల్లో సహజీవనంపై కేసులు నడుస్తున్నాయి. విద్యార్హతలు తక్కువని, కులాలు వేరని, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని యువకులు చెబుతున్నారు. ఏ గుడిలోనో సాక్ష్యాలు లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆపై అవసరాలు తీర్చుకుని బంధాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు అంగీకరించని పరిస్థితి కూడా ఉంది. అత్యధిక కేసుల్లో అమ్మాయిలే మోసపోతున్నారు" అని ఈ సంవత్సరం ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్యలను చూసిన న్యాయవాది అనితా జైన్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ఈ కేసుల్లో న్యాయం జరగకపోతుండటం, అందుకు తగ్గ చట్టాలు ఇండియాలో లేకపోవడం కూడా ఆత్మహత్యలు పెరగడానికి కారణంగా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కోర్టుకు వచ్చే వారిలో అత్యధిక యువతుల వద్ద తమ బంధానికి సంబంధించిన సాక్ష్యాలు ఉండటం లేదని, కలిసి దిగిన చిత్రాలు, వీడియోలు సైతం లేకుండానే సహజీవనం చేస్తున్న వారికి కోర్టులు సైతం న్యాయం చేయలేకపోతున్నాయని అమె అన్నారు. సహజీవనం చేయాలని భావించే యువతులే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News