: బ్రిటన్ లో కాల్పుల కలకలం... దుండగుడి దాడిలో కుప్పకూలిన మహిళా ఎంపీ

ప్రపంచ దేశాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే వరుస దుర్ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతుండగా... తాజాగా బ్రిటన్ లోనూ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లేబర్ పార్టీకి చెందిన యువ మహిళా ఎంపీ దుర్మరణం పాలయ్యారు. తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అయిన మహిళా ఎంపీ లక్ష్యంగా కాల్పులకు దిగిన దుండగుడు... ఆ తర్వాత కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళా ఎంపీ ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళితే... లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉత్తర ఇంగ్లాండ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జో కాక్స్ (41) నిన్న తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అయ్యారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) సభ్యదేశంగా కొనసాగాలా? వద్దా? అన్న విషయంపై ఈ నెల 23న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణపై ఆమె చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ప్రత్యక్షమైన ఓ వ్యక్తి ఎంపీపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో కాక్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. వెనువెంటనే స్పందించిన పోలీసులు ఆమెను సమీపంలోని లీడ్స్ జనరల్ ఇన్ ఫర్మరీకి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోగానే ఆమె ప్రాణాలు కోల్పోయారని అక్కడి వైద్యులు తెలిపారు. బహిరంగ సమావేశంలోనే ఎంపీపై కాల్పులు జరిపిన దుండగుడు పోలీసులకు మాత్రం చిక్కలేదు. అయితే నిందితుడిగా భావిస్తూ బ్రిటన్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News