: పాకిస్థాన్ సైన్యానికి సవాలు విసిరిన మాఫియా డాన్!

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉండే ఓ చిన్న గ్రామంలోంచి మాఫియాడాన్ గా ఎదిగిన వ్యక్తి ఆ దేశ పోలీసులు, ఆర్మీకి 15 రోజుల పాటు సవాల్ విసిరి, ఎట్టకేలకు లొంగిపోయాడు. సింధునది పరివాహక ప్రాంతంలో లంక గ్రామమైన రాజన్ పూర్ లోని వ్యవసాయ కుటుంబంలో గులామ్ రసూల్ అలియాస్ ఛోటు జన్మించాడు. ఆకతాయిగా తిరిగే ఛోటు సరిహద్దు ప్రాంతమైన రాజన్ పూర్ పరిసరాల్లో చోటుచేసుకునే దోపిడీలు, మాఫియా కార్యకలాపాలు, తీవ్రవాదం తదితరాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందజేస్తూ, పదీ, పరకా సంపాదించుకునేవాడు. అలా పోలీసు ఇన్ఫార్మర్ గా పని చేస్తూ పోలీసుల ఆనుపానులు పూర్తిగా తెలుసుకున్నాడు. పోలీసుల పనితీరు, నేరాలు చేసే వారు ఎలా దొరికిపోతున్నారు? వంటి అంశాలపై పూర్తిగా పట్టు వచ్చిన తరువాత సొంతంగా ఓ గ్యాంగును ఏర్పాటు చేశాడు. పకడ్బందీగా ప్లాన్ చేసి దోపిడీలకు పాల్పడేవాడు. కొన్ని సార్లు పట్టుబడ్డప్పటికీ తమ ఇన్ఫార్మరే కదా అని పాక్ పోలీసులు అతని నేరాలను లైట్ తీసుకునేవారు. దీంతో ఛోటూ ఆ ప్రాంతంలో మాఫియా డాన్ గా ఎదిగాడు. ఆ తరువాత అక్రమ ఆయుధాల వ్యాపారంలోకి ఎంటరయ్యాడు. ఇలా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పరిసర గ్రామాల్లోని పేద ప్రజలకు పంచేవాడు. అలా ఆ పరిసరాల్లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో మాఫియాగాళ్లు, తీవ్రవాదులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఛోటు గ్యాంగ్ అంతం చూడాలని పోలీసులు భావించారు. దీనిపై ఆగ్రహించిన ఛోటూ గ్యాంగ్...తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల్లో ఏడుగుర్ని అంతం చేసి, 24 మందిని బందీలుగా పట్టుకుంది. దీంతో సమస్య తీవ్రత గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించింది. అయినప్పటికీ ఛోటూ బెదిరిపోలేదు. సైన్యానికి 15 రోజులపాటు సవాల్ విసిరాడు. పాక్ ప్రధాని సొంత ప్రాతం కావడంతో రక్తపాతం ఉండకూడదని భావించిన భద్రతా దళాలు పలు దఫాలుగా ఛోటూతో చర్చలు జరిపారు. దీంతో తాను, తన కుటుంబం, తన అనుచరుల్లో ముఖ్యులు దుబాయ్ లో తలదాచుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. దీనికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆర్మీ రంగంలోకి దిగిన ఐదు రోజుల తరువాత ఛోటూ లొంగిపోయాడు. అతనితో పాటు 170 మంది అనుచరులు, భారీ ఎత్తున తుపాకులు, ఆయుధాలను ఆర్మీకి స్వాధీనం చేశాడు. దీంతో బందీలుగా ఉన్న 24 మంది పోలీసులను కూడా వదిలిపెట్టాడు. అతని సామ్రాజ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పాక్ ఆర్మీ షాక్ తింది.

More Telugu News