: ఎంత గెలిస్తే మాత్రం ఇన్ని అవాకులా?: డరెన్ సామీపై విండీస్ బోర్డ్

ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ టీ-20 ఫైనల్ పోరులో అద్భుత విజయం సాధించిన తరువాత కెప్టెన్ డరెన్ సామీ చేసిన వ్యాఖ్యలపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మండిపడింది. పోటీలో గెలిచినంత మాత్రాన అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదని హితవు పలికింది. అంతకుముందు సమీ మీడియాతో మాట్లాడుతూ, తమ దేశపు క్రికెట్ బోర్డు తమకు ఎంతమాత్రం గౌరవం ఇవ్వలేదని, సరైన దుస్తులు లేవని, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకు వచ్చామని చెప్పుకొచ్చాడు. టీమ్ మేనేజర్ గా ఉన్న వావ్లే లీవిస్ గతంలో ఏ టీముతోనూ పనిచేయలేదని, అనుభవం లేని వ్యక్తని ఎంపిక చేసి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని విమర్శించాడు. తాము ఫైనల్స్ బరిలోకి దిగకముందే గ్రెనడా ప్రధాని కీత్ మిచెల్, శుభాకాంక్షలు తెలిపారని, తమ బోర్డు, దేశాధినేతల నుంచి ఎలాంటి బెస్ట్ విషెస్ రాలేదని ఆరోపించాడు. సమీ ఈ ఆరోపణలు చేసిన కొద్ది గంటల తరువాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీనిలో వరల్డ్ టీ-20 పోటీలను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐకి అభినందనలు తెలిపింది. డరెన్ సమీ వ్యాఖ్యలపై వెస్టిండీస్ ప్రజలందరి తరఫునా క్షమాపణలు కోరుకుంటున్నామని, దేశంలోని ప్రజలంతా తమ దేశం గెలవాలని కోరుకుందని పేర్కొంది. ఇండియాకు తమ జట్టును పంపేందుకు వ్యయ ప్రయాసలకు ఓర్చామని, సమీ ఎందుకలా మాట్లాడాడో కనుక్కుంటామని తెలిపింది.

More Telugu News