: నన్ను క్ష‌మించండి... అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయాం: ఆఫ్రిది వీడియో సందేశం

తనను మన్నించాలని పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని తన ట్విటర్ పేజీలో వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. దానిలో ఇంకా ఏం తెలిపాడంటే.. 'నా గురించి ఇతరులు ఏమనుకున్నా నేను లెక్క చేయను. కానీ పాకిస్థాన్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. టీ20 వరల్డ్ కప్ లో నేను, నా టీమ్ అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అని చెప్పాడు. కాగా, పాకిస్థాన్‌ టీమ్‌ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిదిపై వేటుకి ఇప్పటికే రంగం సిద్ధమైంది. వరల్డ్‌ కప్‌ తర్వాత అతనిపై వేటు ఖాయమని పాకిస్థాన్‌ క్రికెట్‌ వర్గాలు ఇప్ప‌టికే ప్రకటించేశాయి. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలవడంతో పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మండిప‌డుతోంది. తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన ఆఫ్రిది సేన కీలమైన భారత్‌తో పోరులో మాత్రం ఓడడంతో పీసీబీకి ఆగ్రహం ముంచుకొచ్చింది. మరోపక్క, మ్యాచ్‌కు ముందు, తర్వాత ఆఫ్రిది మీడియాతో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల పీసీబీ అసంతృప్తిగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆఫ్రిది.. తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని వీడియోలో పేర్కొన్నాడు.

More Telugu News