: డ్రింకుల సంగతి దేవుడెరుగు...మంచి నీళ్లు బకెట్లలో పట్టుకుని వెళ్లేవాళ్లం: కపిల్ దేవ్

న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్, టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడంటే పిచ్ లను ఎలా కావాలంటే అలా గ్రౌండ్స్ మన్ తయారు చేస్తున్నారని అన్నారు. అప్పట్లో గ్రౌండ్ ఎలా ఉంటే అలా ఆడాల్సిందేనని అన్నారు. చాలా సందర్భాల్లో తమకు మంచి నీళ్లు కూడా అందుబాటులో ఉండేవి కాదని గుర్తుచేసుకున్నారు. ఆ నీళ్లను కూడా ప్లాస్టిక్ బకెట్లలో పట్టుకుని తామే తీసుకెళ్లేవాళ్లమని చెప్పారు. అలాగే ఇప్పుడు వాడుకలో ఉన్న చాలా వస్తువులు, వాటికి సంబంధించిన పదాలు అప్పట్లో తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు. తమ తరం ఇన్ని సౌకర్యాలు చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆట ఎంతో మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. బౌలింగ్ సమయంలో తన షూస్ చిరిగిపోతే, షూస్ లేకుండా ఒట్టికాళ్లతోనే పరిగెడుతూ బౌలింగ్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని కపిల్ దేవ్ చెప్పారు. అలాంటి పరిస్థితుల మధ్య ఆడాము కాబట్టే ఇప్పుడీ గౌరవం పొందుతున్నామని ఆయన తెలిపారు.

More Telugu News