: జీఎంఆర్ నూ మోసగించిన మాల్యా!... నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఎర్రమంజిల్ కోర్టు

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయల రుణాలను తీసుకుని 17 బ్యాంకులను మోసగించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... తెలుగు నేలకు చెందిన బిజినెస్ టైకూన్ గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్)ను కూడా మోసగించారట. మాల్యా చేసిన మోసంపై జీఎంఆర్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు మాల్యాతో పాటు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ సీఎఫ్ఓకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అయినా జీఎంఆర్ కు మాల్యా చేసిన మోసమేంటనే విషయాన్ని పరిశీలిస్తే... హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూపే నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించిన మొత్తాల చెల్లింపునకు మాల్యా, జీఎంఆర్ గ్రూప్ నకు చెక్కులు ఇచ్చారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట జారీ అయిన సదరు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ గ్రూప్ ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించింది. జీఎంఆర్ పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు... మాల్యా, కింగ్ ఫిషర్ మాజీ సీఎఫ్ఓలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. వారిద్దరిని ఈ నెల 29న తన ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి రంజోజీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News