: స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు!

సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 250 పాయింట్ల లాభానికి సెన్సెక్స్ చేరుకున్న వేళ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో తొలుత నమోదైన లాభం గణనీయంగా తగ్గిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల బాటలోనే రిటైల్ ఇన్వెస్టర్లు కూడా నడిచినట్టు కనిపించింది. అయితే యూరప్ మార్కెట్లు ప్రారంభమైన తరువాత అప్పటి వరకూ నిదానంగానే అయినా నష్టాల దిశగా వచ్చిన సూచికలు, ఆపై స్థిరంగా సాగి స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 86.29 పాయింట్లు పెరిగి 0.35 శాతం లాభంతో 24,804.28 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 28.55 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 7,538.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.31 శాతం, స్మాల్ క్యాప్ 0.41 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్రా, వీఈడీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా, సన్ ఫార్మా, టీసీఎస్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,819 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,323 కంపెనీలు లాభాల్లోను, 1,330 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాడు రూ. 91,64,974 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,04,276 కోట్లకు పెరిగింది.

More Telugu News