: మాల్యా దేశం దాటిపోయారు?... నేషనల్ మీడియాలో కథనాలు

మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు రంగంలోకి దిగిన 17 బ్యాంకులకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఝలకిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తో అప్పటిదాకా విజయవంతమైన వ్యాపారిగా రికార్డులకెక్కిన మాల్యా, ఆ తర్వాత నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ బ్యాంగింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని 17 బ్యాంకులు మాల్యాకు రూ.7 వేల కోట్లకు పైగా రుణాలిచ్చాయి. సదరు అప్పులు వడ్డీతో కలుపుకుని రూ.9 వేల కోట్లకు పెరిగాయి. అయితే ఈ అప్పులో మాల్యా ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా చెల్లించలేక ‘విల్ ఫుల్ డిఫాల్టర్’గా తేలిపోయారు. ఈ క్రమంలో తన ఆధ్వర్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను బ్రిటన్ కంపెనీ డియాజియోకు విక్రయించేసిన మాల్యా, యూఎస్ఎల్ డైకెక్టర్ల బోర్డు నుంచి తప్పుకునేందుకు డియాజియో నుంచి రూ.515 కోట్లను గుడ్ విల్ గా తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కనీస నిధులనైనా చేజిక్కించుకునేందుకు ఎస్బీఐ... డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా, మిగిలిన బ్యాంకులు మాల్యా దేశం విడిచివెళ్లిపోకుండా కట్టడి చేయాలని సుప్రీంకోర్టును నిన్న ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. అయితే అప్పటికే మాల్యా దేశం విడిచి పారిపోయారని నేషనల్ మీడియాలో నేటి ఉదయం నుంచి కథనాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం మాల్యా తమకు అందుబాటులో లేరని, కేవలం ఈ-మెయిల్ ద్వారానే ఆయనతో మాట్లాడగలుగుతున్నామని ఆయన తరఫు ప్రతినిధి చెప్పారు. అసలు మాల్యా ఎక్కడున్నారో కూడా తమకు తెలియడం లేదని ఆ ప్రతినిధి చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే, ఇప్పటికే మాల్యా దేశం విడిచివెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

More Telugu News